Rohit Sharma Pull Shot: క్రికెట్ ప్రపంచంలో ఒక షాట్ చూస్తేనే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వస్తాయి. బౌలర్ భుజం ఎత్తులో విసిరే షార్ట్ బాల్‌ను ఏమాత్రం భయం లేకుండా మైదానం దాటించే ఆ దృశ్యం కేవలం ఒకే ఒక్కడికి సాధ్యం. అతడే భారత జట్టు నాయకుడు, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ. క్రికెట్ చరిత్రలోనే పుల్ షాట్‌ను ఇంత నైపుణ్యంగా, టైమింగ్‌తో ఆడే ఆటగాడు మరొకరు లేరనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ప్రపంచ క్రికెట్‌లో రోహిత్‌తో పోటీపడేలా పుల్ షాట్ ఆడే దిగ్గజాలు ఎవరు? రోహిత్ షాట్ ప్రత్యేకత ఏమిటి?

టైమింగ్ కే రాజా: రోహిత్ శర్మ పుల్ షాట్ రహస్యం..

సాధారణంగా బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో బ్యాటర్లను భయపెట్టాలని చూస్తారు. రోహిత్ శర్మ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. బౌలర్ చేతి నుంచి బంతి విడుదలయ్యే క్షణంలోనే రోహిత్ దాని లెంగ్త్‌ను అంచనా వేస్తాడు. ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, శరీర బరువును వెనుక కాలిపైకి మార్చి బంతిని గాల్లోకి లేపుతాడు. మిగతా బ్యాటర్లు పుల్ షాట్ ఆడేటప్పుడు బంతి నేలబారేలా ఆడటానికి ప్రయత్నిస్తే, రోహిత్ మాత్రం బంతిని నేరుగా స్టాండ్స్‌లోకి పంపిస్తాడు. ఆ టైమింగ్, బ్యాట్ స్పీడ్ చూస్తే అది ఎంత సులువైన షాటో అనిపిస్తుంది.